పెద్దవూర : నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారితో పాటు జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారికి సైతం మండల కేంద్రం ప్రధాన కూడలిగా ఉంది. అనుముల మండలం ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాలన్నా పెద్దవూరకు వచ్చి వెళ్తుంటారు. ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి బస్సులు పెద్దవూర మీదుగా వెళ్తుంటాయి. దీంతో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా పెద్దవూరకు రావాల్సి ఉంటుంది. ఇరవై సంవత్సరాల క్రితం పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద బస్‌షెల్టర్ ఉండేది. రోడ్డు విస్తరణలో భాగంగా దాన్ని అధికారులు తొలగించారు. అప్పటినుంచి ప్రయాణికుల కష్టాలు మొదలయ్యాయి. బస్‌షెల్టర్ నిర్మించకపోవడంతో ఎండలకు ఎండుతూ, వానలకు తడుస్తూ ప్రజలు రోడ్ల వెంట నిరీక్షిస్తుంటారు. బస్సులు రోడ్డు పక్కనే ఆపుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.


