● జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్
రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు వికారాబాద్ కోర్టుకు బదిలీ కాగా.. ఆయన స్థానంలో కొత్తగూడెం నుంచి పి.వసంత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. నల్లగొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి జి.సంపూర్ణ ఆనంద్ రంగారెడ్డి జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. నల్లగొండ కోర్టు నాలుగవ అదనపు జడ్జి కె.కవిత ఇదే కోర్టులో మొదటి అదనపు జడ్జిగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జడ్జి ఎం.కిరణ్మయి నల్లగొండ నాలుగవ అదనపు కోర్టు జడ్జిగా వచ్చారు. ఆదిలాబాద్ నుంచి జడ్జి పి.శివరామ్‌ప్రసాద్ సూర్యాపేట మొదటి అదనపు జడ్జిగా వచ్చారు.
19న ‘మోడల్’ ప్రవేశపరీక్ష
నల్లగొండ : జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో, 7 నుంచి 10వ తరగతులకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లను ఈ నెల 10 నుంచి www.tgms.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. 6వ తరగతికి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతులకు ప్రవేశపరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
13 నుంచి ‘అరైవ్ అలైవ్’
నల్లగొండ : ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత ప్రత్యేక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన శుక్రవారం ఆయన పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించమే లక్ష్యంగా పని చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రచారం చేయాలన్నారు. డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు నిర్వహించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాల తనిఖీలు చేయాలని సూచించారు.


