నల్లగొండ : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరి గోడలు, ఫుడ్ స్టోరేజ్ గోడౌన్‌లు, అమ్మ ఆదర్శ పాఠశాల భవనాలు, తదితర నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అన్ని భవనాల్లో తాగునీటి సౌకర్యం, హాస్టళ్లు, పాఠశాలల్లో టాయిలెట్స్, కిచెన్‌లు, తాగునీటి సదుపాయాలు, ఆర్‌ఓ ప్లాంట్లు సమర్థంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. పనులు నాణ్యతగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీరు ఇబ్బంది లేకుండా బోర్లకు ఏమైనా మరమ్మతులు చేయించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆయుర్వేదంపై అవగాహన కల్పించాలి
నల్లగొండ టౌన్ : ప్రజలు సహజ వైద్య విధానాల వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను సూచించారు. శ్రీప్రజా పాలన– ప్రగతి ప్రణాళికశ్రీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన హోమియోపతి డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద, యునాని, హోమియోపతి విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం హోమియోపతి పితామహుడు డాక్టర్ సామ్యూల్ హానీమన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హోమియోపతి నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పోషకాహారం, తాజా పండ్లు తీసుకోవాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఇతరులకు సేవ చేయగలుగుతారని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, ఆయుష్ ఇన్‌చార్జి డాక్టర్ సుహాసిని, డాక్టర్ ముబీన్ పర్వీన్, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆయుష్ డిపార్ట్‌మెంట్ డీపీఎం కళ్యాణ్, డాక్టర్లు, ఫార్మసిస్టులు, యోగా సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ చంద్రశేఖర్


