శాలిగౌరారం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో చెత్తకుప్పను తలపించేలా ఉన్న మెడికల్ స్టోర్ రూమ్‌ను సిబ్బంది గురువారం శుభ్రపరిచారు. ఆరుబయట ఉన్న లక్షల రూపాయల విలువ కలిగిన సూదిమందుల స్టాక్‌ను స్టోర్‌రూమ్‌లో భద్రపరిచారు. సాక్షి దినపత్రికలో గురువారం ‘శాలిగౌరారం పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత జిల్లా ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని మండల వైద్యాధికారిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో మండల వైద్యాధికారి పీహెచ్‌సీకి వచ్చి కిందిస్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టోర్‌రూమ్‌ను శుభ్రం చేయించారు. గడువుదాటిన సూదిమందులు, నిరుపయోగ వస్తువులను బయటపడేశారు. పీహెచ్‌సీ వరండాలో ఉన్న రూ.లక్షల విలువైన సూది మందులను మెడికల్ స్టోర్‌రూమ్‌లో భద్రపరిచారు. అనంతరం ఘటనకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత ఉన్నతాధికారులకు అందజేశారు.


