మోత్కూరు : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అనాజిపురం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ బునాది గుంతలు తవ్వి పనులను మధ్యలోనే వదిలేశాడు. కాగా సోమవారం విరామం సమయంలో 1వ తరగతి విద్యార్థి చింత రిత్విక్ ఆడుకుంటూ బునాది గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఉపాధ్యాయులు, స్థానికులు గమనించి విద్యార్థిని మోత్కూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఎంఈఓ సత్యనారాయణను వివరణ కోరగా.. కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరితగతిన ప్రహరీ నిర్మాణం చేసేలా చూస్తానని తెలిపారు.


