భూదాన్‌పోచంపల్లి : మూసీ పరీవాహక మండలాల రైతులకు గోదావరి జలాలను అందించి మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. సోమవారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జీబీఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ రైతు సంఘం జిల్లా 3వ మహాసభలను లాంఛనంగా ప్రారంభించారు. మొదటిరోజు శ్రీమూసీ ప్రక్షాళన–గోదావరి జలాల సాధనశ్రీ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మూసీ చుట్టూ రసాయన వ్యర్థాలు వదులుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణపై ఉన్న శ్రద్ధ.. ప్రక్షాళనపై లేదని విమర్శించారు. బస్వాపూర్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరందించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల సాధన కొరకు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పోరాటాలకు సిద్ధ కావాలని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ జహాంగీర్ మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి షామీర్‌పేట, ఏదులాబాద్ మీదుగా చెరువులను నింపుతూ పిలాయిపల్లి కాలువలోకి గోదావరి జలాలను వదిలితే ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందని అన్నారు. గోదావరి జలాల సాధన కొరకు రాజకీయాలకతీతంగా రైతులను చైతన్యం చేస్తూ ఉద్యమకార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం మూసీ వేదిక గౌరవ అధ్యక్షుడు పిట్టల శ్రీశైలం మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మూసీ డంపింగ్‌యార్డుగా మారిందని విమర్శించారు. మూసీ విషపు జలాలతో ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, చర్మ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని, ఇటు పంటలు, పాడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. వెంటనే మూసీ కాలువల కత్వల పైన ఈటీపీలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతు సంఘం నాయకుడు గూడురు అంజిరెడ్డి, న్యాయవాది కొత్త బుచ్చిరెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, మంచాల మధు, పగిళ్ల లింగారెడ్డి, దుబ్బాక జగన్, అందెల జ్యోతి, నెల్లికంటి జంగయ్య, వడ్డేపల్లి యాదగిరి, సామ జంగారెడ్డి, పుష్పలత, నోముల కృష్ణారెడ్డి, కోట అశోక్, బుగ్గ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి


