● 108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్‌తండాకు చెందిన బి. నిఖిత ఐదు నెలల గర్భిణి. సోమవారం ఇంట్లో బోరు మోటారు స్విచ్ ఆన్ చేస్తుండగా ఆమె విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను అంబులెన్స్‌లో ఎక్కించుకొని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిఖిత పరిస్థితి నిలకడగా ఉందని 108 అంబులెన్స్ పైలెట్ పి. సైదులు, మెడికల్ టెక్నీషియన్ సీహెచ్. వెంకటేశ్వర్లు తెలిపారు.
విద్యుత్ తీగలు తగిలి
గడ్డి లోడు దగ్ధం
● మంటలు ఆర్పివేసిన పోలీస్ కానిస్టేబుళ్లు
మఠంపల్లి : మండలంలోని కాల్వపల్లితండాకు చెందిన రైతు బానోతు రూప్లానాయక్ సోమవారం తన వ్యవసాయ పొలం నుంచి వరి గడ్డిని ట్రాక్టర్‌లో లోడు చేసుకుని ఇంటికి తీసుకొస్తుండగా కరెంట్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. గడ్డి దగ్ధమవుతుండడంతో వెంటనే రైతు మఠంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసు కానిస్టేబుళ్లు విజయ్, రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సమీపంలోని వ్యవసాయ బోరుతో పాటు బావి నుంచి బకెట్లతో నీటిని తీసుకొచ్చి మంటలు ఆర్పివేశారు. ఫైరింజన్ కోసం వేచి చూడకుండా మంటలు ఆర్పివేసిన కానిస్టేబుళ్లను గ్రామస్తులు అభినందించారు.
జూదరుల అరెస్ట్
త్రిపురారం : మండలంలోని కామరెడ్డిగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై సోమవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారయ్యారు. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామరెడ్డిగూడెం గ్రామ శివారులోని కుంట సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి కామెల్ల లక్ష్మణ్, గోగుల చందన్, పల్లపు శ్రీనును అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన దోరెపల్లి శేఖర్, రెమిడాల దుర్గయ్య, రెమిడాల మహేందర్, నర్సింగ్ విజయ్ పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.600 నగదు, మూడు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


