మేళ్లచెరువు : యువకుడిపై దాడి చేసి అతడి బైక్, సెల్‌ఫోన్ లాక్కోని పరారైన వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్‌ఐ పరమేష్ తెలిపారు. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన నవీన్ ఈ నెల 4వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మండల కేంద్రంలోని ఓ దాబాలో భోజనం చేసి వచ్చాడు. అదే సమయంలో చందమల్ల శ్రీకాంత్ అలియాస్ చిక్కుల శ్రీకాంత్ నవీన్ వద్దకు వచ్చి అకారణంగా అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నవీన్‌పై కర్రలతో శ్రీకాంత్ దాడి చేసి బైక్, సెల్‌ఫోన్ లాక్కోని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటిరోజు ఉదయం నవీన్ కుటుంబ సభ్యులు అతడి ఒంటిపై గాయాలను గమనించి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్‌ను అతడి ఇంట్లో సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిపై 7 కేసులు ఉన్నాయని, దీంతో అతడిపై రౌడీషీట్ తెరిచినట్లు పేర్కొన్నారు.
లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అడ్డగూడూరు : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన వంట మాస్టర్ వేల్పుల నర్సయ్య, జెట్ట తండాకు చెందిన సరిత కలిసి మోత్కూరు మండలంలో ఓ ఫంక్షన్‌లో వంట చేసి బైక్‌పై తిరిగి తిరుమలగిరికి వెళ్తున్నారు. మార్గమధ్యలో అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామ శివారులోని నూనె మిల్లు సమీపంలో రోడ్డు పక్కనే ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.


