రామగిరి (నల్లగొండ) : ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఆయన రచించిన ఏడుకోలల బాయి ఎన్నికల శతకంపై నల్లగొండలోని యూటీఎఫ్ భవన్‌లో సోమవారం సృజన సాహితీ ఆధ్వర్యంలో పద్యగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు తమకు కేటాయించిన శతకంలోని పద్యాలను పాడారు. ఈ సందర్భంగా ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కవిత్వాన్ని జీవితంలో భాగంగా భావిస్తానన్నారు. తాను సంప్రదాయ పద్యాన్ని ఎంచుకొని ఆధునిక వస్తువు ఎన్నికల తీరుపై శతకాన్ని రచించానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్య మాట్లాడుతూ.. ఏనుగు లక్ష్మణకవి సంస్కృత కావ్యం సుభాషిత రత్నావళిని తెలుగులో అనువదించారని, ఇప్పుడు ఏనుగు నరసింహారెడ్డి సామాన్యుల హృదయాలలోని భావాలను పద్య కవిత్వంగా ఏడుకోలల బాయి శతకాన్ని రాయడం ఎన్నికల స్వరూపాన్ని మార్చాలనేది ఉద్దేశమన్నారు. ప్రాచీన పద్యం ద్వారా వర్తమాన సమస్య ఎన్నికల వ్యవస్థ గురించి చెప్పడం వినూత్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెరుమాళ్ల ఆనంద్ మాట్లాడుతూ.. ఐదు శతాబ్దాల క్రితమే వేమన పద్య ప్రక్రియ ద్వారా ఆనాటి సమాజంలోని తప్పులను ఎత్తిచూపి సామాజిక సంస్కరణకు దోహదపడ్డారని, ఇప్పుడు సీస పద్యాలతో భారత ఎన్నికల్లోని లొసుగులను నరసింహారెడ్డి ఎత్తిచూపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తండు కృష్ణకౌండిన్య, తూర్పు మల్లారెడ్డి కనకటి రామకృష్ణ, సాగర్ల సత్తయ్య, బండారు శంకర్, ఇడికోజు శ్రీనివాసాచారి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, నర్రా సుఖేందర్‌రెడ్డి, సి. అనితకుమారి, శీల అవిలేను, బరిగెల శ్రవణ్, గడ్డం శ్రీను, కాసుల ఆంజనేయులు, బైరెడ్డి కృష్ణారెడ్డి, బక్క పిచ్చయ్య, మామిడి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ
సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి


