యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళహారతులను నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళవాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు.. నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో ముగిశాయి.


