చండూరు : చండూరులో గత ఆదివారం వ్యక్తిగత కారణాలతో యువకుల మధ్య జరిగిన ఘర్షణతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం చండూరు రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ గొడవలో కాంగ్రెస్ కార్యకర్తలు నలుగురు మాత్రమే ఉన్నారని, మిగిలిన 12 మంది బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలేనని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు.. కోమటిరెడ్డి బ్రదర్స్, కోడి బ్రదర్స్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 10 వార్డుల్లో పోటీచేస్తే ఒక్కటి కూడా గెలువలేదని, ఎవరిని బొందపెట్టాలో ప్రజలకు తెలుసన్నారు. చండూరు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కోడి గిరిబాబు మాట్లాడుతూ ఇసుక మాఫియా నడిపే ఓ వ్యక్తి.. పోలీసుల అండతో అమాయకులైన యువకులపై కేసులు పెట్టించారని, గాయాలపాలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పిటీషన్ ఇస్తే కూడా కేసు ఫైల్ చేయకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు. దళిత యువకుడిని దూషించినా పోలీసులు పట్టించుకోకపోవం శోచనీయమన్నారు. గంగిడి మనోహర్‌రెడ్డి చీడపురుగని, బీజేపీకి పట్టిన దరిద్రం అని దుయ్యబట్టారు. వ్యక్తిగత గొడవలకు కూడా బీజేపీ బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కటకం రమేష్, కాంగ్రెస్ నాయకులు కోడి వెంకన్న, పందుల సత్యం, కృష్ణారెడ్డి, హైమద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు


