రామగిరి(నల్లగొండ) : నల్లగొండ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లనుంది. హైదరాబాద్ చర్లపల్లి నుంచి అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య ఈ రైలు ఈ నెల 13 నుంచి రాకపోకలు సాగించనుంది. ఈ రైల్‌లో స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు వల్ల ఉత్తర–తూర్పు భారతదేశానికి తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం కలగనుంది. ఈ రైలు జిల్లాలోని నల్లగొండ స్టేషన్‌లో ఆగుతుంది.
బీఆర్‌ఏఓయూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
రామగిరి(నల్లగొండ) : గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ అంబేద్కర్‌లో ఓపెన్ యూనిర్సిటీ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణ కోర్సులు అందించనున్నట్లు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ ధర్మానాయక్ తెలిపారు. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు మంగళవారం ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో బీఆర్‌ఏఓయూలో అనేక మార్పులు తీసుకోస్తున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ, భూదాన్‌పోచంపల్లి జలాల్‌పూర్ స్వామి రామనందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ కోర్సులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్ మాట్లాడుతూ, చదువే కాకుండా, డిగ్రీ పూర్తయిన వారు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ దూరవిద్య కేంద్రం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎన్నో రంగాల్లో కల్పించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు, కళాశాల కౌన్సిలర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
నూతన విద్యా విధానంతో ‘వికసిత్ భారత్’
మిర్యాలగూడ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ద్వారా భారతదేశం ‘వికసిత్ భారత్’గా అవతరిస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ – అచీవ్‌మెంట్స్ అండ్ ఛాలెంజర్స్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. మాతృభాషలోనే ప్రపంచ విషయాలను నేర్చుకునేలా విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని తెలిపారు. కళాశాల అర్థశాస్త్ర ప్రొఫెసర్ గుమ్మడి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అకడమిక్ కో–ఆర్డినేటర్ పి.నాగరాజు, సీనియర్ అధ్యాపకులు వెంకటరమణ, పి.రవీందర్, శివకృష్ణ, నాగరేఖా, రాణి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఎర్రబెల్లి జాతర
నిడమనూరు : ఎర్రబెల్లి జాతర ముగిసింది. మంగళవారం సాయంత్రం సంప్రదాయంగా దేవరపెట్టను గోపాలపురం గ్రామానికి సాగనంపారు. వీడ్కోలు కార్యక్రమంలో ఎర్రబెల్లి యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓ లింగా.. ఓ లింగా.. గజ్జెల మోతలు, కాటారుల విన్యాసాలు, భేరి, డోలు వాయిధ్యాల చప్పుళ్ల నడుమ దేవరపెట్టను గోపాలపురానికి తరలించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మన్నెం వెంకన్నయాదవ్, మన్నెం రంజిత్‌యాదవ్, శ్రవణ్‌కుమార్, నారాయణ, పూజరులు బొల్లం లింగయ్య, ఏడుకొండలు పాల్గొన్నారు.


