మిర్యాలగూడ : ప్రస్తుత సమాజంలో నాటికలు ఆయా సమస్యలను, సవాళ్లను ప్రతిభావంతంగా చర్చించి, పరిష్కారాలు కూడా సూచిస్తున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త జయిని మురళి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిసోర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నూకల జగదీష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలను రెండవ రోజు మంగళవారం వారు ప్రారంభించి మాట్లాడారు. సందర్భంగా ‘ఎవరు’ అనే సాంఘిక నాటికను అద్దెపల్లి, ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి, గుంటూరు వారు ప్రదర్శించగా ‘తరమెళ్లిపోతున్నది’ అనే సాంఘిక నాటకాన్ని శ్రీకరణం సురేష్ మెమోరియల్ థియేటర్ గుంటూరు, ‘ఇంద్రప్రస్థం’ అనే సాంఘిక నాటికను అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం నటీనటులకు ప్రోత్సాహక బహుమతులతోపాటు షీల్డ్‌లను అందించారు. మొదట సిరిమువ్వ నాట్యమండలి మిర్యాలగూడ మాస్టర్ రాము, అభినయ రుద్ర నాట్యమండలి ఖమ్మం మాస్టర్ ఫణికుమార్ సంయుక్తంగా చిన్నారులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామవతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తిశర్మ, నారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.


