మర్రిగూడ : ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులకు నిత్య ఆదాయం లభిస్తుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి కె.సుభాషిణి అన్నారు. మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉద్యానశాఖ సహకారంతో రైతులకు నిర్వహించిన సాంకేతిక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎకరం ఆయిల్‌పామ్ సాగు చేస్తే ఏడాదికి రూ.1.50 లక్షలు నికర ఆదాయం పొందవచ్చన్నారు. మొక్క నాటిన నాటి నుంచి మూడు సంవత్సరాల తరువాత కాపు ప్రారంభమై 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందన్నారు. అదేవిధంగా కోకో, వక్క సాగును అంతర పంటలుగా సాగు చేసినట్లయితే అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి, పత్తి, బత్తాయి కంటే అధిక ఆదాయం వచ్చే పంట కేవలం ఆయిల్‌పామ్ మాత్రమేనన్నారు. అనుముల మండలంలో పామ్ అయిల్ ఫ్యాక్టరీ పనులు సాగుతున్నాయని తెలిపారు. రైతులు మొక్కలు నాటుకునే సమయంలో బై బ్యాక్ పాలసీ అగ్రిమెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పతంజలి కంపెనీ కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పతంజలి డీజీఎం యాదగిరి, మేనేజర్ మధుసూదన్‌రెడ్డి, ఏడీఏ వేణుగోపాల్, నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారి రావుల విద్యాసాగర్, ఏఓ సుహాస్, నర్రా రవీందర్‌రెడ్డి, ప్లాంటేషన్ అధికారి భానుచందర్, ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, మోహన్, స్వామి, బాబు, రైతులు పాల్గొన్నారు.


