నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని తెలంగాణ టూరిజం విజయ విహార్ అతిథి గృహంలో శనివారం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయవిహార్ మేనేజర్ కిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని టూరిజం వసతిగృహాల్లో పర్యాటకులను ఆహ్లాదపరిచేలా సాంప్రదాయమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సాగర్ విజయవిహార్ అతిథి గృహంలో నేటి నుంచి ప్రతి శనివారం, ఆదివారాల్లో సాంప్రదాయ బద్ధమైన బంజారా నృత్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
బౌద్ధ భిక్షువుల భిక్షాయాత్ర
నాగార్జునసాగర్ : థాయిలాండ్ దేశానికి చెందిన బౌద్ధ భిక్షువుల బృందం శుక్రవారం నాగార్జునసాగర్‌లో భిక్షాయాత్ర నిర్వహించింది. సుమారు 20మంది బౌద్ధ భిక్షువులు నందికొండ మున్సిపాలిటీలోని ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. స్థానికులు తమకు అందుబాటులో ఉన్న బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్లు, పండ్లు, ఆహార పదార్థాలను వారికి ఇచ్చారు. వీరితో పాటు బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
444 బస్తాలు..
20 సెకన్లలో నోస్టాక్
గట్టుప్పల్ : గట్టుప్పల్ మండలం పరిధిలోని రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. పంటలు సాగు చేసిన నాటి నుంచి నేటివరకు యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరగడం రైతులకు దినచర్యగా మారుతోంది. శుక్రవారం మండల కేంద్రం ఓ ఫర్టిలైజర్ షాపునకు 444 బస్తాల యూరియా వచ్చింది. ఉదయం 10 గంటలకు యూరియాను ఆన్‌లైన్‌లో పెట్టడం.. 20 సెకన్లలో నోస్టాక్ అని రావడం రైతులను ఆశ్చర్యానికి గురిచేసింది. నాట్లు వేసిన నాటి నుంచి పొలాలు పొట్ట దశకు వచ్చినా యూరియా దొరకడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు.
బీసీ కుల గణన చేపట్టాలి
మిర్యాలగూడ టౌన్ : దేశవ్యాప్తంగా జరగనున్న జన గణనలో బీసీ కుల గణన కూడా చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులుగౌడ్ కోరారు. శుక్రవారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల జనాభా ఎంత ఉందో లెక్క కట్టకపోవడంతో బీసీలకు చట్టబద్ధంగా వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించి బీసీల కుల గణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.


