మునుగోడు : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, ప్రతి పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆయన చదువుకున్న మునుగోడు మండలం పలివెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తే మంచి నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. తాను పలివెల ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్లే రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్సీ పదవి పొందగలిగానని చెప్పారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై శ్రద్ధ చూపకపోవం వల్లే ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని చెప్పారు. తన సొంత నిధులతో పలివెల పాఠశాలకు సౌకర్యాలు కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గజ్జల ధనలక్ష్మి, మాజీ ఎంపీపీ మాదగోని సాయిలుగౌడ్, మాజీ జెడ్పీటీసీ గొసుకొండ లింగయ్య, బూడిద లింగయ్యయాదవ్, ఉప్ప సర్పంచ్ చెర్కు సునీత, హెచ్‌ఎం తాటి శ్రీనువాసులు, ఉపాధ్యాయులు దత్తు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


