నల్లగొండ టౌన్ : వేసవికాలం ప్రారంభమైంది. ఈసారి ఎండలు మండుతాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దావఖానాల్లో ఇప్పటికే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. దాంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ సిబ్బంది, ఆశ వర్కర్ల వద్ద కూడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనుంది. వడదెబ్బ బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, సైలెన్ బాటిళ్లను సిద్ధం చేసింది. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించనుంది.
ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు..
వేసవి నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసింది. అందులో వైద్యులతో పాటు పారా మెడికల్ సిబ్బంది, ఇతర టెక్నిషియన్లు ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా వేసవిలో వచ్చే జబ్బులు ప్రబలి ప్రజలు ఇబ్బంది పడితే వెంటనే ఆ బృందాలు ఆ గ్రామానికి చేరుకుని అవసరమైన చికిత్స అందించనుంది. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా నుంచి సమాచారం అందిన వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం సభ్యులను ఆయా ప్రాంతాలకు పంపనున్నారు.
వైద్యులు అందుబాటులో ఉండాల్సిందే..
ఎండలు పెరుగుతున్నందున అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దవాఖానాల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. సమయపాలన పాటించడంతో పాటు పనిచేసే చోటే నివాసం ఉండాలని స్పష్టం చేసింది.
ఫ వేసవి నేపథ్యంలో అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు
ఫ ఆస్పత్రుల్లో సిద్ధంగా మందులు, సైలెన్ బాటిళ్లు
ఫ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ


