కోఆప్షన్‌ పదవులపై గురి | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌ పదవులపై గురి

Mar 3 2026 7:23 AM | Updated on Mar 3 2026 7:23 AM

20 మందికి పైగా ఆశావహులు..

నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి రిజర్వేషన్లు, కొత్త వారికి అవకాశం కల్పించడం లాంటి వాటితో తాజా మాజీ కౌన్సిలర్లకు పోటీ చేసే అవకాశం రాలేదు. దాంతో అలాంటి వారికి కో ఆప్షన్‌ పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డివిజన్లలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా పట్టు ఉండి.. పలు కారణాలతో స్వల్ప ఓట్లతో ఓడిన మాజీ కౌన్సిలర్లు తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్పొరేషన్‌ ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు సైతం కో ఆప్షన్‌ పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాదాపు 20 మంది కో ఆప్షన్‌ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నగరంలో చర్చ సాగుతోంది.

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకవర్గం కొలువు దీరడంతో కో ఆప్షన్‌ పదవులపై ఆశావహులు గురిపెట్టారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీచేసే అవకాశం రాని వారు, టికెట్‌ లభించినా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారు కో ఆప్షన్‌ పదవులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కో ఆప్షన్‌ పదవులు ఆశిస్తున్న నాయకులు ఇప్పటికే పైరవీ మొదలు పెట్టారు. కొందరు మంత్రి హామీ తమకు ఇచ్చారని చెబుతుండగా, మరికొందరు వివిధ మార్గాల ద్వారా పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరానికి చెందిన కీలక నాయకులను ప్రసన్నం చేసుకొని మంత్రి దృష్టిలో పడేందుకు ఆశావహులు తంటాలు పడుతున్నారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నాలుగు కో ఆప్షన్‌ పదవులు ఉండగా, కార్పొరేషన్‌ అయినందున అదనంగా ఎన్ని పెరుగుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా అయితే ఆరుగురికి కో ఆప్షన్‌ పదవులు ఇవ్వాలని మంత్రి కూడా సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.

ఏ పార్టీ అధికారంలో ఉంటే వారే..

నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 48 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే అధికార పార్టీకి చెందిన వారినే కో ఆప్షన్‌ పదవుల్లో నియమిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మేధావులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, మైనార్టీ వర్గాలకు చెందిన వివాద రహితులకు కో ఆప్షన్‌ పదవులు ఇస్తుంటారు. నగరాభివృద్ధిలో సలహాలు, సూచనలు ఇస్తూ పాలకవర్గానికి చేదోడు, వాదోడుగా ఉండేవారిని, రాజకీయాలకు అతీతంగా ఉండే వారికి చోటు కల్పించాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారినే నియమిస్తున్న విషయం తెలిసిందే.

ఫ నీలగిరి కార్పొరేషన్‌లో

పైరవీలు మొదలు పెట్టిన నాయకులు

ఫ మంత్రి దృష్టిలో పడేందుకు ఆశావహుల తంటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement