నల్లగొండ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హోలి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రజ లందరి జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ కలిసి జరుపుకునే ఈ రంగుల పండుగ మన సంస్క్రతికి, ఐక్యతకు నిదర్శనమన్నారు. ప్రజలు రసాయన రంగులకు దూరంగా ఉండి, ప్రకృతి సహజ రంగులతో పర్యావరణానికి హాని కలగకుండా హోలి పండుగ జరుపుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
నకిరేకల్ : విద్యా ప్రమాణాలు పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని విద్యాశాఖ ప్యానల్ ఇన్‌స్పెక్షన్ నోడల్ టీం ఆఫీసర్ చామల నర్సయ్య, టీం సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్, కే.రవికుమార్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఈ బృందం సోమవారం నకిరేకల్ మండలం నోముల ప్రాథమిక పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ చామల నర్సయ్య పలు సూచనలు చేశారు. నోముల పాఠశాలలో బోధనాభ్యసన ప్రక్రియ, అన్ని విషయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్‌ఎం పాక ప్రసాద్, ఉపాధ్యాయులు ఉదయశ్రీ, సునీత, రవి, సృజన తదితరులు ఉన్నారు.
ఇంటర్ పరీక్షలకు 441 మంది గైర్హాజరు
నల్లగొండ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మ్యాథ్స్, బోటని, పొలిటికల్ ైసెన్స్ పరీక్షలు సోమవారం జరిగాయి. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 14,722 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 14,281 మంది పరీక్ష రాశారు. 441 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
బీఈడీలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడాలి
నల్లగొండ టూటౌన్ : బీఈడీ విద్యలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో కలిపి కనీసం 10 మంది అధ్యాపకులను విధిగా నియమించాలన్నారు. ఆధార్‌లింక్‌తో అధ్యాపకుల నమోదు జరగాలని, 75 శాతం విద్యార్థి హాజరును కచ్చితంగా పాటించేందుకు ఫేస్ రికగ్నిషన్ మెషిన్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ఆకుల రవి పాల్గొన్నారు.


