నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 123 ఫిర్యాదులురాగా.. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 59, ఇతర పిర్యాదులు 64 వచ్చాయని తెలిపారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగియనున్నందున ఆయా పద్దుల కింద మంజూరైన నిధులు, చేపట్టిన పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. హాస్టళ్ల తనిఖీపై నిర్దేశించిన ప్రొఫార్మాలో మండలాల ప్రత్యేక అధికారులు నివేదికను సమర్పించాలన్నారు. వేసవి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ప్రత్యేక అధికారులు వెంటనే మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్న సందర్భంగా మండలాల ప్రత్యేక అధికారులు భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


