ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు : ప్రభుత్వం పత్రి పల్లెకు ఆర్‌టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామస్తులు తమకు నల్లగొండ నుంచి మునుగోడు మీదుగా బస్సు నడపాలని ఇటీవల ఎమ్మెల్సీని కలిసి కోరగా.. ఆయన ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి ఆ గ్రామానికి బస్సు ఏర్పాటు చేయించారు. సోమవారం మునుగోడులో బస్సును ప్రారంభించి అదే బస్సులో లింగవారిగూడెం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం నూటికి నూరుశాతం అమలయ్యేందుకు ప్రతిపల్లెకు బస్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడంపై లింగవారిగూడెం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కురిమిద్ద శ్రీనివాస్, రామచంద్రం, బొల్గూరి నర్సింహ, వెంకటేశ్వర్లు, గాలయ్య, పల్లె శేఖర్ రెడ్డి, లక్ష్మయ్య, కూసుకుంట్ల సత్తిరెడ్డి పాల్గొన్నారు.


