వైద్యం చేస్తానని.. పుస్తెలతాడు అపహరణ | - | Sakshi
Sakshi News home page

వైద్యం చేస్తానని.. పుస్తెలతాడు అపహరణ

Feb 10 2026 8:05 AM | Updated on Feb 10 2026 8:05 AM

వైద్యం చేస్తానని.. పుస్తెలతాడు అపహరణ

వైద్యం చేస్తానని.. పుస్తెలతాడు అపహరణ

భూదాన్‌పోచంపల్లి: సంతానం లేని వారికి వైద్యం చేస్తానని నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తి మహిళ నుంచి 4 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించాడు. ఈ ఘటన సోమవారం ఉదయం భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని గాంధీనగర్‌లో జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన వంగూరి ప్రణీత, రాజ్‌కుమార్‌ దంపతులకు వివాహమై ఐదేళ్లవుతున్నా సంతానం కలగకపోవడంతో వైద్యులతో చికిత్స తీసుకుంటున్నారు. బైక్‌పై హెల్మెట్‌ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి సోమవారం రాజ్‌కుమార్‌ ఇంటి వద్దకు వచ్చి సంతానం లేని వారికి కేరళ ఆయుర్వేద వైద్యం చేస్తామని నమ్మించాడు. ఇందుకు రూ.12వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఇది నమ్మిన రాజ్‌కుమార్‌ దంపతులు రూ.6వేలు ఇస్తామని చెప్పారు. ఈ మేరక సదరు వ్యక్తి మొదట రాజ్‌కుమార్‌ ఒంటికి నూనె లాంటి పదార్థాన్ని పూసి అతడిని స్నానం చేసి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత ప్రణీతకు కూడా మెడ భాగంలో నూనె పూస్తూ పుస్తెలతాడును తీయమని చెప్పడంతో ఆమె తీసి మంచం పైన పెట్టింది. అనంతరం ఆమెను కూడా స్నానం చేసి రమ్మని చెప్పాడు. ప్రణీత స్నానానికి వెళ్లగానే మంచంపై ఉంచిన పుస్తెలతాడు సదరు వ్యక్తి తీసుకొని అక్కడ నుంచి ఉడాయించాడు. ప్రణీత స్నానం చేసి వచ్చి చూడగా ఆ వ్యక్తి లేడు, పుస్తెలతాడు కన్పించలేదు. వెంటనే తేరుకొని భర్త రాజ్‌కుమార్‌ ఆమె చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగుడు అంతకుముందు వైద్యం చేస్తామని చెప్పి ఇదే కాలనీకి చెందిన మరో వ్యక్తితో మాట్లాడిన మొబైల్‌ నంబర్‌ను పరిశీలించగా ట్రూ కాలర్‌లో అతడి పేరు వెంకటేశ్వర్‌రావు అని, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాగా వస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉంటే సంతానం లేనివారికి వైద్యం చేస్తామంటూ ఇటీవల పోచంపల్లిలో పలువురి వద్ద వేల రూపాయలు వసూలు చేసి ఉడాయించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement