ఆడపిల్లలకు వరాల జల్లు
చిట్యాల : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులోని పోటీచేస్తున్న కౌన్సిలర్ ఆభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్లలకు పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటించారు. 9వ వార్డులో ఆడపిల్ల పెళ్లి చేస్తే రూ.10,116, ఆడపిల్ల పుడితే రూ.5,116 అందిస్తానని ఆ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆగు అశోక్ తరఫున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రకటించారు. 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్ల పుడితే రూ.11,116, ఆడపిల్ల పెళ్లికి రూ.15,116 అందజేస్తామని హామీ ఇచ్చారు. అదే వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిర్రబోయిన సమతా శ్రీకాంత్ తన వార్డులో ఆడపిల్లపు పుట్టిన, ఆడపిల్ల పెళ్లి చేసినా రూ.10,116 అందిస్తానని హామీనిచ్చారు. 10వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మనగోటి శ్రీను వార్డు ప్రజలు శుభకార్యాలు జరుపుకొంటే ఫంక్షన్‌హాల్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అదే వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిలివేరు శేఖర్ తరఫున ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు వార్డులో అడపిల్ల పెళ్లికి రూ.10వేలు అందిస్తామని హామీ ఇచ్చాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 7వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన కూరెళ్ల లింగస్వామి తన వార్డులో ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో అదే వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లింగస్వామి భార్య జ్యోతి ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 నజరానా ఇస్తామని ప్రకటించారు.
ఫ మున్సిపల్ అభ్యర్థుల హామీలు


