విద్యార్థులు మత్తుకు బానిసలు కావొద్దు
నల్లగొండ : విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా కావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మత్తు మందుల నివారణ, రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీల సమావేశాల్లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల్లో గాంజా వంటి మత్తు పదార్థాలను విద్యార్థులు వినియోగించకుండా నిఘా పెట్టి అవగాహన కల్పించాలన్నారు. నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలోని డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్‌ను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని శాఖలు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ జనవరి 26న పాఠశాలల్లో మత్తు పదార్థాల నివారణపై ప్రత్యేకంగా రూపకం ప్రదర్శించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో 2025 నాటికి బ్లాక్‌స్పాట్లను తగ్గించడంతోపాటు ప్రమాదాలను అరికట్టామన్నారు. సమావేశాల్లో డీఈఓ భిక్షపతి, ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికా రులు చత్రునాయక్, శశికళ, సంధ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, రహదారుల సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ట్రాన్స్‌పోర్ట్, ఆర్టీసీ ఆర్‌ఎం పాల్గొన్నారు.


