దివ్యాంగులందరికీ ట్రై సైకిళ్లు అందిస్తాం
నల్లగొండ : జిల్లాలో అర్హత కలిగిన దివ్యాంగులందరికీ దశలవారీగా బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణ పరిధిలోని టీటీడీసీలో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అనేకమంది దివ్యాంగులు తమకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు ఇవ్వాలని ప్రజావాణిలో దరఖస్తులు చేస్తున్న నేపథ్యంలో ఈసీఐఎల్ యాజమాన్యంతో మాట్లాడి మొదటి విడతగా 105 మంది దివ్యాంగులకు మోటార్ ట్రైసైకిళ్లు ఇప్పిస్తున్నామన్నారు. ఇందులో 50 మందికి పంపిణీ చేశామన్నారు. తాను జిల్లా కలెక్టర్‌గా వచ్చిన వెంటనే సర్వే నిర్వహించి జిల్లాలో 55వేల మంది దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్ల మాదిరిగానే కృత్రిమ అవయవాలు అవసరం ఉందని, ఇందుకు సర్వే నిర్వహించి రిపోర్టు వచ్చిన తర్వాత అలింకో, ఈసీఐఎల్‌కు సమర్పిస్తామన్నారు. మోటార్ సైకిళ్లు సమకూర్చి ఇచ్చిన ఈసీఐఎల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగులకు తమ సంస్థ ద్వారా ట్రై సైకిళ్లు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రామస్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు, అలింకో డీజీఎం సందేశ్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఈసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్ సాంబమూర్తి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మాతనాయక్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళ్యాణ్, అలింకో ప్రతినిధులు డాక్టర్ రవిశంకర్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


