గృహం.. ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

గృహం.. ఆలస్యం!

Aug 30 2025 10:17 AM | Updated on Aug 30 2025 10:17 AM

గృహం.. ఆలస్యం!

గృహం.. ఆలస్యం!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టే విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 600 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేస్తే బిల్లులు ఇచ్చే అవకాశం లేకపోవడం, ఇళ్ల నిర్మాణాలకు ముందుగా ప్రజలే డబ్బులు వెచ్చించాల్సి రావడం, దశల వారీగా (బేస్‌మెంట్‌, రూఫ్‌, స్లాబ్‌ తదితర లెవల్స్‌) బిల్లులను మంజూరు చేయాలన్న నిబంధనల నేపథ్యంలో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఇప్పటివరకు ముగ్గుపోసిన నిళ్లలో సగం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.

18,048 ఇళ్లు మంజూరు

జిల్లాకు మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు 35.62 శాతం ఇళ్ల నిర్మాణాలే ప్రారంభమయ్యాయి. జిల్లాకు 18,048 ఇళ్లు మంజూరైతే అందులో 12,865 ఇళ్లకు ముగ్గు పోశారు. వాటిల్లో 6,427 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే నిర్మాణ పనులు మిర్యాలగూడ (43.07 శాతం), మునుగోడు (43.02 శాతం) నియోజకవర్గాల్లో ఎక్కువశాతం ప్రారంభమయ్యాయి. ఆ తరువాత స్థానంలో నల్లగొండ (38.50 శాతం), దేవరకొండ (38.28 శాతం) నియోజకవర్గాలు నిలిచాయి. నకిరేకల్‌లో మాత్రం తక్కువ (15.25 శాతం) ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి.

యాదాద్రి జిల్లాలో 81.42 శాతం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆగస్టు నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజలో ఉంది. యాదాద్రి జిల్లాకు 9,495మిళ్లు మంజూరైతే, అందులో ఇప్పటివరకు 7,730 ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అంటే 81.42 శాతం ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. నల్లగొండ జిల్లాలో మాత్రం 35.62 శాతమే ప్రారంభం కావడం గమనార్హం.

ఆర్థిక ఇబ్బందులను

తొలగిస్తున్నా..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డబ్బుల్లేక నిరుపేదలు ఇళ్లను నిర్మించుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి గ్రహించారు. వారికి మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాలను సంప్రదించే పేదలకు రుణాలు ఇప్పించే బాధ్యతను డీఆర్‌డీఓకు అప్పగించారు.

ఇళ్ల నిర్మాణాలపై

కలెక్టర్‌ దృష్టి

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మెటీరియల్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఇటీవల కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లకు అవసరమైన ఇసుక విషయంలో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నల్లగొండ నియోజకవర్గంలో గృహనిర్మాణ శాఖ అధికారులు, తహసీల్దార్లతో ఇటీవల మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అలాగే మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాలపైనా ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సమీక్షలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణాలను వేగవేంతం చేసేలా చర్యలు చేపడుతున్నారు.

ముగ్గు పోసిన ఇందిరమ్మఇళ్లలో సగమే ప్రారంభం

ఫ ఇళ్ల నిర్మాణానికి అడ్డంకిగా నిబంధనలు

ఫ మంజూరు చేసిన వాటిల్లో ప్రారంభమైనవి 35.62 శాతమే..

ఫ రాష్ట్రంలోనే మొదట స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా

ఫ నల్లగొండలో ఇళ్ల గ్రౌండింగ్‌పై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

ఫ నిర్మాణాల్లో వెనుకబడిన నియోజకవర్గాల్లో సమీక్షలు

జిల్లాకు మంజూరైన ఇళ్లలో ప్రారంభమైన వాటి వివరాలు..

నియోజకవర్గం మంజూరు ముగ్గుపోసినవి ప్రారంభం శాతం

నల్లగొండ 3380 2390 1301 38.50

మిర్యాలగూడ 3042 2079 1310 43.07

నకిరేకల్‌ 2702 1985 412 15.25

దేవరకొండ 2696 1940 1032 38.28

నాగార్జునసాగర్‌ 3517 2432 1315 37.39

మునుగోడు 2176 1621 936 43.02

తుంగతుర్తి 535 418 121 22.61

(శాలిగౌరారం)

మొత్తం 18048 12865 6427 35.62

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement