
ఉద్యాన పంటల సంరక్షణకు కృషి
నిడమనూరు : సంప్రదాయ, ఉద్యానవన పంటల సంరక్షణకు చేస్తున్నామని రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం నిడమనూరు మండలంలోని గుంటిపల్లి, ఎర్రబెల్లి, జంగాలవారిగూడెంలో బత్తాయి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంప్రదాయ పంటలకు దూరం కాకుండా ప్రభుత్వం సబ్సిడీ, మార్కెటింగ్ వంటి సౌకర్యాలు కల్పించేలా రైతు కమిషన్ కృషి చేస్తుందన్నారు. నల్లగొండ జిల్లాలో పదేళ్ల క్రితం 1.32 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండగా.. ఇప్పుడు 42 వేల ఎకరాలకు తగ్గాయన్నారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర అధికంగా ఉండాలని, మద్దతు ధర విషయంలో సాగు వ్యయం కంటే అధనంగా 50 శాతం ఇవ్వాలని చెప్పినట్లు వివరించారు. ఈ సందర్భంగా గుర్రంపోడు, నిడమనూరు, త్రిపురారం, మాడ్గులపల్లి, పీఏ పల్లి, పెద్దవూర మండలాల రైతులు తిరుపతిలోని బత్తాయి పరిశోధన కేంద్రం నుంచి 2018లో 42 మంది రైతులు 418 ఎకరాల్లో సాగు చేయగా, నేటికీ కాత, పిందె లేదని, తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకునేలా చూడాలని కమిషన్‌కు విన్నవించారు. బత్తాయి రైతు సమస్యలను నల్లగొండ కలెక్టరేట్‌లో శనివారం చర్చించి పూర్తిస్థాయి నివేదికతో ముఖ్యమంత్రిని కలిసి నివేదిస్తామని కోదండరెడ్డి వెల్లడించారు. ఆయన వెంట భూమి సునీల్, కేవీఎన్ రెడ్డి, వెంకన్నయాదవ్, భవాని, ప్రసాదరావు, బాబు, ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సుభాషిణి, వ్యవసాయ ఉప సంచాలకులు సరితా, ఏఓ ముని కృష్ణయ్య, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, ఉద్యానవన అధికారులు అనంతరెడ్డి, మురళి, రిషిత, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పరిశోధన కేంద్రం సందర్శన
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామపంచాయతీలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం రైతు కమిషన్ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్, భవాని సందర్శించారు. ఈ సందర్భంగా సిట్రస్ (సుమధుర నారింజ), ఇతర ఉద్యాన పంటల పరిశోధన, వాటి భవిష్యత్ అవకాశాలపై సీనియర్ సైంటిస్ట్ రాజాగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నారింజ, నిమ్మ, పామాయిల్ వంటి ఉద్యాన పంటల సమస్యలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల రైతు సత్యనారాయణరెడ్డి పరిశోధన కేంద్రం అభివృద్ధిని వివరించారు.
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
నిడమనూరు మండలంలో
బత్తాయి తోటల పరిశీలన