
అభ్యంతరాలు స్వీకరిస్తాం : కలెక్టర్
నల్లగొండ : గ్రామపంచాయతీ ముసాయిదా ఓటరు జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే.. 30వ తేదీ (శనివారం) వరకు స్వీకరిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 869 గ్రామ పంచాయతీల్లో.. 7,494 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 10,73,506 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28న ఎంపీడీఓల ద్వారా మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించామన్నారు. ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలను ఈ నెల 30వ తేదీలోగా సమర్పించవచ్చని తెలిపారు. అభ్యంతరాలను ఈనెల 31న పరిశీలించి, పరిష్కరిస్తామన్నారు. సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు. శనివారం మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, చీర పంకజ్‌యాదవ్, పిచ్చయ్య, లింగస్వామి, యాదగిరి, రఫీక్, నర్సిరెడ్డి, సైదిరెడ్డి, అన్సారి, అద్దంకి రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల వినతి
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఓటర్ల జాబితాను సవరించాలని కోరారు. అయితే.. ఓటరు జాబితాపై సమావేశం నిర్వహిస్తున్నామని.. ఇది గ్రీవెన్స్ కాదని కలెక్టర్ అనడంతో సమావేశం నుంచి భాస్కర్‌రావు వెళ్లిపోయినట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.