రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల అనంతపురం జిల్లా బెస్ట్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ నాగజ్యోతి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ శుక్రవారం ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్ మాట్లాడుతూ ఈ ఎంఓయూ 2030 వరకు కొనసాగుతుందన్నారు. పరస్పర ఉపన్యాసాలతో పాటు పరిశోధన రంగంలో సహకారం ఉంటుందన్నారు. మునిస్వామి, జ్యోత్న్స, ఎం.అనిల్‌కుమార్, వైవిఆర్. ప్రసన్నకుమార్‌కు యూనివర్సిటీ ద్వారా పీహెచ్‌డీ గైడ్‌షిప్ లభించిందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.రవికుమార్, కృష్ణ పాల్గొన్నారు.
‘కోడింగ్, కృత్రిమ మేధ’ బోధించాలి
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కోడింగ్, కృత్రిమ మేధ సబ్జెక్టులను అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో భౌతిక, గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పైథాన్ లాంగ్వేజీలోని కోడింగ్, కృత్రిమ మేధ అంశాలపై పాఠ్యాంశాలను ప్రత్యేక పుస్తకం ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ రామచంద్రయ్య, ఆర్పీలు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, జగన్ పాల్గొన్నారు.
15న ఎంజీయూ స్నాతకోత్సవం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించి శుక్రవారం యూనివర్సిటీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై పలు సూచనలు చేశారు. ముఖ్య అతిథులుగా ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరవుతారని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో పీజీ విద్యార్థులకు 57 గోల్డ్ మెడల్స్, 22 మందికి పీహెచ్‌డీ పట్టాలను అందించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఈఓ ఉపేందర్‌రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు
నల్లగొండ : జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2025–26 విద్యా సంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో మిగిలిన సీట్లలో నేరుగా ప్రవేశాలు జరుగుతాయని డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థుల, తల్లిదండ్రులు సంబంధిత మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని తెలిపారు.