
సాదాబైనామా.. హక్కులపై ధీమా
జిల్లాలో 33,294 సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వం సాదాబైనామాలు పరిష్కరించేందుకు పూనుకున్నప్పటికీ అది ఆచరణలో అమలుకు నోచుకోలేదు. దాంతో రైతుల ఆశలు నెరవేరలేదు. పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలకు అర్హత లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తామని చెప్పడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాదాబైనామాతో భూములను కొనుగోలు చేసిన రైతులు.. ఆ భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. దీనిపై ఎట్టకేలకు పరిష్కారం చూపేందుకు అడుగులు పడుతున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాదాబైనామాలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ధరణి పోర్టల్‌లో వాటి పరి ష్కారానికి అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తీసుకువచ్చింది. అందులో భాగంగా సాదాబైనామాల పరిష్కారానికి ప్రభుత్వం మూడురోజుల కిందట నిర్ణయం తీసుకోవడంతో.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 33,294 సాదాబైనామాల పరిష్కారంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
సాగులో ఉన్నా.. హక్కుల్లేవు
గ్రామాల్లో సాదా కాగితాలపై రాసుకొని భూములు కొనుగోలు చేసి కబ్జాలో ఉంటున్న రైతులు వేలల్లో ఉన్నారు. వారు ఆ భూములను పట్టా చేసుకోకుండానే కబ్జాలో ఉంటున్నారు. అధికారికంగా హక్కులు లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో (ధరణిలో) సాదాబైనామాలపై భూములు కొన్న వారికి చుక్కెదురైంది. భూములను కొనుగోలు చేసి, సాధారణ పేపర్లపై రాసుకొని, కబ్జాలో ఉన్న వారికి కాకుండా ఆన్‌లైన్‌లో ఎవరి పేరు మీద భూమి ఉందో వారికే పాస్‌బుక్‌లు రావడంతో ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే కాకుండా ధరణి వచ్చిన తరువాత తలెత్తిన అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. ఆ తరువాత టీఎం33 మాడ్యుల్ ద్వారా కొంతవరకు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరిగింది. అయితే సాదాబైనామాలకు మాత్రం పరిష్కారం లభించలేదు. సాదాబైనామాలను ప్రత్యేకంగా పరిష్కరిస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్నినా ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సమస్య పక్కన పడింది.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్
రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు ధరణి పోర్టల్ కారణమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంది. ధరణి రద్దు చేసి, కొత్త చట్టం తెస్తామని ప్రకటించింది. అందులో భాగంగా సాదాబైనామాలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చింది. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ఇతర శాఖలకు బదిలీ అయిన వీఆర్‌ఏ, వీఆర్వోలను కూడా తిరిగి మాతృ శాఖకు తీసుకుంటోంది. అలాగే సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది.
పెండింగ్‌లో ఉన్న మండలాల వారీగా
సాదాబైనామా దరఖాస్తులివే..
ఫ ఏళ్ల తరబడి ఎదురుచూపులకు కలగనున్న మోక్షం
ఫ ధరణిలోనూ సాదాబైనామా రైతులకు ఇబ్బందులే..
ఫ భూభారతి వచ్చాకే హక్కుల కల్పనపై దృష్టి
ఫ జిల్లాలో 33 వేల దరఖాస్తులు పెండింగ్
మండలం దరఖాస్తులు
చండూరు 334
గట్టుప్పల్ 97
మర్రిగూడ 398
మునుగోడు 1248
నాంపల్లి 663
చందంపేట 175
చింతపల్లి 451
దేవరకొండ 238
గుడిపల్లి 168
గుండ్లపల్లి 311
గుర్రంపోడు 764
కొండమల్లేపల్లి 155
నేరడుగొమ్ము 144
పీఏపల్లి 203
అడవిదేవులపల్లి 458
అనుముల 813
దామరచర్ల 1306
మాడ్గులపల్లి 2228
మిర్యాలగూడ 3068
నిడమనూరు 654
పెద్దవూర 875
తిరుమలగిరిసాగర్ 2071
త్రిపురారం 1458
వేములపల్లి 1710
చిట్యాల 617
కనగల్ 805
కట్టంగూర్ 1769
కేతేపల్లి 2168
నకిరేకల్ 2098
నల్లగొండ 1680
నార్కట్‌పల్లి 665
శాలిగౌరారం 1913
తిప్పర్తి 1589