
మరణం ఏదైనా.. ఆర్థిక చేయూత
ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులైన పేద కుటుంబాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు చేయూత అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ సాయం ఆయా కుటుంబాల తమ ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుంది.
– కలెక్టర్ ఇలా త్రిపాఠి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన కుటుంబ పెద్ద మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) కింద కుటుంబ తక్షణ అవసరాల కోసం రూ.20 వేలు అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 3,500 కుటుంబాలకు రూ.7 కోట్ల ఆర్థికసాయం అందించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈనెల 30వ తేదీలోగా కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఎలా మరణించినా..
దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న పేద కుటుంబాల్లోని 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయస్సు కలిగిన కుటుంబ పెద్ద (మహిళ లేదా పురుషుడు) గడిచిన రెండేళ్లలో చనిపోయి ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు లేదా సహజంగా మరణించినా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. అంత్యోదయ అన్న బీమా యోజన, జన శ్రీ బీమా యోజన పథకాల కింద లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
తహసీల్దార్ కార్యాలయాల్లో
దరఖాస్తుల స్వీకరణ
ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయవచ్చు. దరఖాస్తుతో పాటు మరణ ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు పత్రం, అడ్రస్ రుజువు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు తెలిపే రేషన్‌కార్డు లేదా ధ్రువపత్రం జతచేయాలి. సహాయం పొందేందుకు దరఖాస్తు చేసిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు పత్రం, అడ్రస్, వయస్సు, కుటుంబ సభ్యుడి ధ్రువపత్రం, ఆధార్ కార్డు లింక్ చేసిన బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీస్ ఖాతా వివరాలతో పాటు, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది.
గ్రామ కార్యదర్శులకు ఆదేశాలు
గ్రామాల్లో 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు మరణించిన వారికి సంబంధించిన వివరాలను గ్రామ పంచాయతీల్లోని జనన, మరణ రిజిస్టర్ల ఆధారంగా వెంటనే ఎంపీడీఓలకు పంపించాలని గ్రామ కార్యదర్శులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎంపీడీఓలు వాటిని పరిశీలించి, ఆ జాబితాలను తహసీల్దార్లకు అందజేయాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు ఆయా జాబితాను పంపించాలనివివరించారు.
తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు
ఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం
ఫ జాతీయ కుటుంబ ప్రయోజన
పథకం కింద లబ్ధి
ఫ జిల్లాలో 3500 మందికి
ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం
ఫ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న
పేదలకు ప్రయోజనం
ఫ మరణించిన రెండేళ్లలో దరఖాస్తు చేసుకునే వెసలుబాటు
ఫ ఈనెల 30వ తేదీ వరకు గడువు
ఫ ఇప్పటివరకు వచ్చింది
2070 దరఖాస్తులే..
ఈ పథకం కింద జిల్లాలో మొత్తంగా 3,500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,070 కుటుంబాలకు చెందిన పేదలు దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధి చేకూర్చే వారి సంఖ్య కంటే దరఖాస్తులు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పథకంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అర్హులైన నిరుపేదలు దరఖాస్తు చేసుకునేలా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, గ్రామ సమాఖ్య సంఘాలతోనూ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, మండల ప్రత్యేక అధికారులు ఈ పథకంపై సమన్వయ సమావేశం నిర్వహించి, పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈనెల 30వ తేదీ వరకు వచ్చే దరఖాస్తులపై తహసీల్దార్లు పూర్తి విచారణ జరిపి, ఆర్డీఓలకు పంపించాలని, ఆర్డీఓలు ఆన్‌లైన్ ద్వారా డీఆర్‌ఓకు, తనకు పంపించాలని వివరించారు.

మరణం ఏదైనా.. ఆర్థిక చేయూత