
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పనులు వేగవంతం అయ్యాయి. ఓటర్ల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. అందుకు అనుగుణంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వార్డుల వారీగా కొత్త ఓటర్ల జాబితాలను గత నెలలోనే గ్రామ పంచాయతీ లాగిన్ ద్వారా రూపొందించారు. ఆ ప్రక్రియను ఇటీవలే పూర్తి చేశారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నేపథ్యంలో వాటిని మరొకసారి సరిచూసుకుని, వాటిపై అభ్యంతరాలు ఆహ్వానించి, వాటిని పరిష్కరించి తుది జాబితాలను ప్రకటించనున్నారు.
షెడ్యూల్ ఇలా..
ఈ నెల 28వ తేదీన గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను నోటీసు బోర్డుల్లో పెడతారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రదర్శిస్తారు. 29వ తేదీన జిల్లా అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 30వ తేదీన ఎంపీడీఓలు మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 28 నుంచి 30వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో ఆ అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరిస్తారు. వచ్చే నెల 2వ తేదీన 868 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
ఫ పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా ఖరారుకు నోటిఫికేషన్
ఫ షెడ్యూల్ జారీ చేసిన కలెక్టర్
ఫ వచ్చే నెల 2న పోలింగ్ కేంద్రాలు, ఓటరు తుది జాబితా ప్రకటన