
పాఠశాలలను ప్రతిరోజూ సందర్శించాలి
నల్లగొండ: మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలను క్షేత్రస్థాయిలో నిరంతరం సందర్శించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెంపునకు కృషిచేస్తూనే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, వివిధ మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో సమావేశం
పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించడంపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశానికి హాజరు కావాలని కోరారు.
దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలి
శాలిగౌరారం: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్‌ఎఫ్‌బీఎస్) దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శాలిగౌరారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో ఎన్‌ఎఫ్‌బీఎస్ కింద దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీల తుది ఓటరు జాబితా ప్రచురణకు తీసుకుంటున్న చర్యలపై ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ శాలిగౌరారం–మాధారంకలాన్ ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఊట్కూరు గ్రామ సమీపంలో వరదనీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారిన లోలెవల్ కాజ్‌వేను పరిశీలించారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్‌చేసి కాజ్‌వేను పరిశీలించి బ్రిడ్జి నిర్మాణానికి అంచనా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అదేవిధంగా వరదనీటితో కోతకు గురైన ఊట్కూరు–బండమీదిగూడెం రోడ్డును పరిశీలించి నివేదిక అందజేయాలని తహసీల్దార్, ఎంపీడీఓలను ఆదేశించారు.
ఫ ఎంఈఓలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన

పాఠశాలలను ప్రతిరోజూ సందర్శించాలి