
టైలరింగ్, మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ
నల్లగొండ: నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) లో టైలరింగ్, కంప్యూటర్, మగ్గం వర్క్‌లో మహిళలకు సెప్టెంబర్ 6 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని జిల్లా మేనేజర్ ఎ.అనిత ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న ిమహిళలకు ఒక్కో కోర్సులో రెండు నెలల పాటు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 76600 22517 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువకులకు నల్లగొండ పట్టణ పరిధిలోని రామ్‌నగర్‌లో గల ఎస్‌బీఐ శిక్షణ కేంద్రంలో ఏసీ, రిఫ్రిజిరేటర్ రిపేరులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బీఐ ఆర్‌సెటీ డైరెక్టర్ ఇ.రఘుపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణతోపాటు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 3వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, పూర్తి వివరాలకు 97010 09265 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
చెర్వుగట్టు ఆలయ రికార్డులు తనిఖీ
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గురువారం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ టెండర్లు, అన్నదానం, రోజువారి టికెట్ల ఆదాయానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రికార్డులను తనిఖీ చేసినట్లు తెలిపారు. వారి వెంట నల్లగొండ ఏసీ భాస్కర్, ఈఓలు రుద్ర వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
‘పీఎం సురక్ష’లో చేర్పించాలి
నల్లగొండ: ఉపాధిహామీ పథకంలో పనిచేసే వేతనదారులందరినీ పీఎం సురక్ష బీమా పథకంలో చేర్పించాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో మండల స్థాయి సిబ్బందిని కోరారు. 18 నుంచి 75 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరూ అర్హులనని పేర్కొన్నారు. ఏడాది కాల పరిమితి కలిగిన ఈ బీమాలో చేరితో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని, పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.లక్ష నగదు అందుతాయని తెలిపారు.
సెప్టెంబర్ 4 వరకు పింఛన్ల పంపిణీ
జిల్లాలో గురువారం నుంచి చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభమైందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు లబ్ధిదారులకు ముఖ గుర్తింపు సాప్టువేర్ ద్వారా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్టు డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్‌దారులంతా రూ.16 చిల్లరను కూడా అడిగి తీసుకోవాలని పేర్కొన్నారు.
నేటి నుంచి ఎంజీయూలో క్రీడా పోటీలు
నల్లగొండ టూటౌన్: భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 6గంటలకు మూడు కిలోమీటర్ల పరుగు పందెం ఉంటుందని తెలిపారు.