
అస్తమించిన ఎర్ర సూరీడు
ఫ అనారోగ్యంతో సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత
ఫ రెండుసార్లు నల్లగొండ ఎంపీగా సేవలు
ఫ కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా సీపీఐ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సురవరం సుధాకర్‌రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్యాస విడిచారు. సురవరం పుట్టిపెరిగింది నాగర్‌కర్నూల్ జిల్లా అయినా.. ఆయన ఉద్యమ ప్రస్తానం నల్లగొండ జిల్లాతో ముడిపడి ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో, పార్టీ విస్తరణకు ఆయన కృషిచేశారు. నల్లగొండ జిల్లా నుంచే రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. రైతు, కూలీల సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ, బానిసత్వం అంశాలపై సీపీఐ తరఫున ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు జరిగిన కార్యక్రమాల్లో ఆయన ముందున్నారు. ఆయన నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి 1998, 2004లో గెలుపొందారు. ఎంపీగా పనిచేసిన కాలంలో జిల్లా సమస్యలు, ముఖ్యంగా సాగునీటి సమస్యలను పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించారు. కాగా, సురవరం సుధాకర్‌రెడ్డి మృతికి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంతో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

అస్తమించిన ఎర్ర సూరీడు