
దోమలు పుట్టకుండా.. కుట్టకుండా..
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
నల్లగొండ టూటౌన్ : ప్రస్తుత వానాకాలంలో దోమలు వ్యాప్తి చెందకుండా వాటి ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అడ్డుకట్ట వేసేందుకు నీలగిరి వార్డుల్లో మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత ఏడాది పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వందలాది మంది డెంగీ, చికున్‌గున్యా, సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తుగా బస్తీ కాలనీలపై మున్సిపల్ యంత్రాంగం నజన్ పెట్టింది. దీంట్లో భాగంగా పేద, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా నివాసముంటున్న పట్టణంలోని ఏఆర్ నగర్, హిందూపూర్, పాతబస్తీ, అక్కచల్మ, లైన్‌వాడ, కుమ్మరివాడ, మాన్యంచల్క, హైదర్‌ఖాన్‌గూడ, అబ్బాసియా కాలనీ, రహ్మత్‌నగర్, షమ్స్‌నగర్, రాంనగర్, గొల్లగూడ, కేశరాజుపల్లి, బీటీఎస్, కతాల్‌గూడెం, మామిళ్లగూడెం, గంధంవారిగూడెం, అర్బన్ కాలనీ, లెప్రసీ కాలనీ, పానగల్, చర్లపల్లి, ఎన్‌టీఆర్ కాలనీ, గిరకబావి గూడెం, అక్కలాయిగూడెం, ముత్యాలమ్మ కాలనీ, సూర్యవంశీ కాలనీ గుట్ట, వెంకటరమణ కాలనీల్లోని బస్తీ వాసులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
వీటిపైనే అవగాహన..
ఇంటి ఆవరణలో పాత తొట్లు, ఇతర సామగ్రి, తాగి పడేసిన కొబ్బరిబోండాలు, మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది, మెప్మా ఆర్పీ, బస్తీల్లో పేదల ఇంటికి వెళ్లివారి ఇంట్లో ఉండే కూలర్లు, పూల కుండీలు, ఇతర పాత సామగ్రిని ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోని నీటి సంపులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లేకుండా దోమలు చేరి వాటి ద్వారా డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతాయని పేర్కొంటున్నారు. దోమలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైతన్యపరుస్తున్నారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా జ్వరాలు, ఇతర వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి ఇంట్లో ఉండే సెప్టిక్‌ట్యాంక్ ఎయిర్ పైపులకు జాలీలు లేకపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. దీనిపై ప్రజలకు కనీస అవగాహన లేని కారణంగా సెప్టిక్ ట్యాంక్ ఎయిర్ పైప్‌కు జాలి పెట్టడంలేదు. పట్టణంలో ఒక్క శాతం ఇంట్లో కూడా ఎయిర్ పైప్‌లకు జాలి లేవనే చెప్పాలి. మున్సిపల్ యంత్రాంగం ప్రజలకు జాలీలు అమర్చుకునే విధంగా జాగృత పర్చాల్సిన అవసరం ఉంది.
ఫ నీలగిరి బస్తీ కాలనీలపై మున్సిపల్ యంత్రాంగం నజర్
ఫ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు కార్యాచరణ
ఫ ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్న సిబ్బంది
ఫ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన
బస్తీ కాలనీల్లో పరిశుభ్రతపై ప్రజలకు మున్సిపల్ సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఇంట్లోకి సిబ్బంది వెళ్లి పాత సామగ్రి తొలగించడం, కుండీలు, కూలర్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. అవసరంలేని వస్తువుల ద్వారా దోమలు ఎక్కువగా వస్తాయి. ఇళ్లలో అవి లేకుండా తొలగించుకోవాలి.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్,
మున్సిపల్ కమిషనర్