
బీసీ కోటాపై ఆశలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా పెంపు అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్ల కంటే ఈసారి పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆశావహులు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వపరంగా అమలు విషయంలో అడ్డంకులు ఉండడంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తూ ముందుకు సాగేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో దీనిపై పక్కా అభిప్రాయానికి రానుంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం బీసీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఎన్ని పెరిగే అవకాశం ఉంటుందో అధికార పార్టీతోపాటు ఇతర పార్టీల్లోనూ ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు.
భారీ అంచనాల్లో అధికార పార్టీ ఆశావహులు
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు 2019లో జరిగాయి. 2024లో పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయింది. అయినా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతోంది. అయితే ఇందుకు చాలా అడ్డుంకులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ల పెంపుపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నా, పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్ల అమలుతో ముందుకెళ్లే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏయే మండలాల్లో ఏయే గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు అవకాశాలు దక్కుతాయన్న విషయంలో అధికార పార్టీ నేతలు, ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు.
ఫ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న ప్రభుత్వం
ఫ పార్టీ పరంగా ఓకే.. ప్రభుత్వ పరంగా తప్పని చిక్కులు
ఫ త్వరలోనే పీఏసీ, కేబినెట్ సమావేశాల్లో కొలిక్కి వచ్చే అవకాశం
ఫ సెప్టెంబర్ మొదటి వారంలోపే
జారీ కానున్న ఎన్నికల షెడ్యూల్!