
ఎనిమిది గేట్ల ద్వారా మూసీ ఉరకలు
కేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం సాయంత్రం వరకు 15,643 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల రిజర్వాయర్‌లో 643.35 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు ఆదివారం నాలుగు గేట్లు ఎత్తగా సోమవారం మాత్రం ఎనిమిది క్రస్ట్ గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి ఇన్‌ఫ్లోకు సమాంతరంగా 15,442 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా మూసీ కుడి, ఎడమ కాల్వలకు 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల రిజర్వాయర్‌లో ప్రస్తుతం 4.03 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.