
ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా నీరు
పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ వినియోగంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు, హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గాను ఏఎమ్మార్పీ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల కొనసాగుతుంది. పుట్టంగండి వద్ద గల సాగర్ వెనుక జలాల నుంచి ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా 2400 క్యూసెక్కుల నీరు ఏకేబీఆర్‌కి రావాల్సి ఉంది. అయితే యూనిట్ – 4 మోటారు మే నెలలో మరమ్మతులకు గురికావడంతో అధికారులు మే 28న బాగు చేసే పనులు ప్రారంభించారు. దీంతో మూడు మోటార్ల ద్వారా మొన్నటి వరకు కేవలం 1800 క్యూసెక్కుల నీరు ఏకేబీఆర్‌కు వచ్చింది. దీంతో ఉదయసముద్రానికి 1000 క్యూసెక్కుల నీటి మాత్రమే విడుదల చేశారు. ప్రధానకాలువ వెంట ఉన్న డిస్ట్రిబ్యూటరీలకు సరిపడా నీరు అందలేదు. అంతే కాకుండా ఏకేబీఆర్ లెవల్‌ను పెంచడానికి సరిపడా నీరు అందకపోవడంతో డి–7బీకి నీటి విడుదల సాధ్యం కాలేదు. మోటార్ మరమ్మతు పనులు బుధవారం పూర్తయ్యాయి. యూనిట్ – 4 మోటారును తిరిగి ప్రారంభించారు. దీంతో గురువారం నుంచి ఏఎమ్మార్పీ నాలుగు మోటార్ల ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపుతున్నారు. అక్కడినుంచి ప్రధానకాలువ ద్వారా 1130 క్యూసెక్కులు ఉదయసముద్రానికి, హైదరాబాద్ జంటనగరాలకు 525 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 45 క్యూసెక్కులు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల కొనసాగుతుందని ఏఎమ్మార్పీ అధికారులు తెలిపారు.