
డీసీసీబీ పాలకవర్గ పదవీకాలం పొడిగింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా నాగార్జున మార్కెటింగ్ సొసైటీ (ఎన్‌డీసీఎంఎస్), జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. గురువారం పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గురువారమే వాటి పదవీకాలాన్ని పొడిగిస్తూ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 107 పీఏసీఎస్‌లు, ఎన్‌డీసీఎంఎస్‌తోపాటు డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు మరో ఆరునెలలపాటు ఆ పదవుల్లో కొనసాగుతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ తరువాత మళ్లీ పొడిగిస్తారా? ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న అంశంపై జనవరి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. జిల్లాలోని పీఏసీఎస్‌లు, డీసీసీబీ పాలకవర్గాల నియామకం కోసం ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించింది. అదే నెల 14వ తేదీన పాలకవర్గాలు బాధ్యతలను స్వీకరించాయి. దాని ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ నాటికి కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అందులో భాగంగా డీసీసీబీ, పీఏసీఎస్‌లకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించింది. ఇప్పుడు తాజాగా రెండోసారి మరో ఆరు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించింది.
రైతు సంక్షేమానికి మరింతగా కృషి
ప్రభుత్వం రైతుల సంక్షేమ, అభివృద్ధికి మరోసారి కృషి చేసే అవకాశాన్ని తమకు కల్పించిందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. రానున్న ఆరు నెలల కాలంలో బ్యాంకును మరింత అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాని పేర్కొన్నారు.
పీఏసీఎస్ పాలకవర్గాల గడువు సైతం పొడిగించిన ప్రభుత్వం
మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు డీసీసీబీ చైర్మన్‌గా కుంభం శ్రీనివాస్‌రెడ్డి