
రాబడి స్వల్పం.. ఖర్చు అధికం
నీలగిరి మున్సిపాలిటీలో ఖర్చులకు తగ్గట్టు రాని ఆదాయం
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి
సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఖర్చులకు తగ్గట్టు ఆదాయం రావడం లేదు. నెలనెలా రూ.2.84 కోట్ల ఖర్చు వస్తుంటే..ఆదాయం మాత్రం రూ.2 కోట్లలోపే ఉంటోంది. దీంతో ఖర్చులను సర్దుబాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రతినెలా ఇబ్బందులు పడుతున్నారు. నీలగిరి మున్సిపాలిటీ విస్తరణకు తగ్గట్టుగానే కార్మికులు, ఉద్యోగులను నియమించారు. మున్సిపాలిటీ పరిధిలోని 48వార్డుల్లో మొత్తం 43 వేలకు పైగానే భవనాలు ఉండగా ఏడాదికి రూ.18 కోట్ల ఆస్తి పన్ను ద్వారా ఆదాయం వస్తుంది. నల్లా కనెక్షన్లు మాత్రం 29వేల వరకే ఉండగా వీటి ద్వారా ఏడాదికి రూ.3 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కలుపుకుంటే మొత్తం రూ.21 కోట్ల రాబడి వస్తుంది. భవనాలకు అనుమతుల ద్వారా నెలకు రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. కానీ ఈ డబ్బులు నేరుగా సీడీఎంఏ ఖాతాలో జమ అవుతుండగా.. ఐదారు నెలలకు ఒకసారి మున్సిపాలిటీలకు ప్రభుత్వం పంపుతుంది. కానీ మున్సిపాలిటీలో అన్ని ఖర్చులకు ఏడాదికి దాదాపు 34.08 కోట్ల వరకు అవుతుందని అధికారులు చెబుతున్నారు.
813 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వివిధ పనుల కోసం మొత్తం 813 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి వీరికి నెలకు వేతనాల కింద రూ.1.20 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. వాహనాల డీజిల్‌కు రూ.22 లక్షలు, పంప్‌హౌస్, వీధి దీపాలు, పవర్ బోర్స్, ఆఫీస్ కరెంట్ బిల్లు నెలకు రూ.75 లక్షల వరకు వస్తుంది. ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు వేతనాలు నెలకు రూ.7.50 లక్షలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్ నెలకు రూ.40 లక్షలు, పైప్‌లైన్, లీకేజీ మరమ్మతుల నిర్వహణ ఖర్చులు రూ.10 లక్షలు, వాహనాల నిర్వహణ ఖర్చు నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీకి నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతుండగా, ఆదాయం మాత్రం అనుకున్నంతగా రావడంలేదని తెలుస్తోంది.
010 పద్దు ద్వారా వేతనాలు ఇస్తే సరి..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు కార్మికులు చెబుతున్నారు. ఆ హామీ ప్రకారం కార్మికులను రెగ్యులరైజ్ చేసి 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీకి వేతనాల భారం తప్పనుంది. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తున్న మాదిరిగా.. వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు ఇస్తే మున్సిపాలిటీకి నిర్వహణ భారం నుంచి విముక్తి కలగనుంది.
న్యూస్‌రీల్
ఫ ఖర్చు రూ.2.84 కోట్లు.. ఆదాయం రూ.2 కోట్ల లోపే..
ఫ నెలనెలా జమకాని భవనాల
అనుమతుల సొమ్ము
ఫ మున్సిపల్ సిబ్బందికి తప్పని
సర్దుబాటు ఇక్కట్లు
ఫ కార్మికుల వేతనాలు
ప్రభుత్వం ఇస్తే తప్పనున్న భారం
ఆదాయ వనరుల పెంపుపై దృష్టేదీ?
పట్టణంలో ఏర్పాటవుతున్న వ్యాపారాలన్నింటినీ ఎప్పటికప్పుడు అసెస్‌మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ అధికారులు, సిబ్బంది సమన్వయలోపం, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఆస్తి పన్నును పెంచుకోవడంలో విఫలమవుతున్నారనే చర్చ సాగుతోంది. ఆదాయ వనరును అందిపుచ్చుకోవాలని సీడీఎంఏ అధికారులు చెబుతున్నా ఆ దిశగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేడయంలేదు. ఆస్తి పన్ను, నల్లా బిల్లుల ద్వారా ఆదాయం దాదాపు రూ.40 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నా.. ఆ దిశగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాబడి స్వల్పం.. ఖర్చు అధికం