
రోగులకు ఇబ్బందులు రానివ్వద్దు
నల్లగొండ టౌన్: రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వార్డుల్లో ఉన్న పేషెంట్లకు ఎక్స్‌రేలు, స్కానింగ్, ఇతర పరీక్షలు చేయాలంటే వార్డు నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న రేడియాలజీ డిపార్ట్‌మెంట్ వరకు ఎండలో స్ట్రక్చర్, వీల్‌చైర్లపై, నడిపిస్తూ తీసుకెళ్తున్న పరిస్థితిపై ‘రోగులకు పరీక్ష కష్టాలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి కలెక్టర్ స్పందించి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీయూ, సర్జికల్, మెడికల్ వార్డులతోపాటు రేడియాలజీ విభాగాన్ని పరిశీలించి వైద్యులు, నర్సులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగం దూరంగా ఉండడంతో నడవలేని రోగులకు మొబైల్ ఎక్స్ రే యూనిట్ ద్వారా ఎక్స్ రే తీస్తున్నట్లు, నడవగలిగే వారిని వీల్‌చైర్ మీద రేడియాలజీ రూమ్‌కు తీసుకెళ్తున్నట్లు వైద్యులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డాక్టర్లు, సిబ్బంది, నర్సులు అందుబాటులో ఉంటూ సకాలంలో వైద్యం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఆమె వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్, ఆర్‌ఎంఓ కిరణ్‌కుమార్, టీఎస్‌ఎంఐడీసీ రాజశేఖర్, జితేందర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి

రోగులకు ఇబ్బందులు రానివ్వద్దు