
బుద్ధవనం సందర్శనకు అమెరికన్ల ఆసక్తి
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని, నాగార్జునకొండను సందర్శించటానికి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల మహాయాన బుద్ధ విహార ప్రధానాచార్యుడు ఆసక్తి కనబర్చారని బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బౌద్ధాలయాల సందర్శనలో భాగంగా శనివారం ఆయన న్యూయార్క్ కెనాల్ వీధిలోని మహాయాన బౌద్ధాలయాన్ని సందర్శించి బుద్ధవనం, నాగార్జునకొండను సందర్శించమని ప్రధానాచార్యుడిని ఆహ్వానించినట్లు తెలిపారు. బుద్ధవనంలో ఆచార్య నాగార్జునుడి రచనలపై ఒక పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలని, కృష్ణా నది తీరంలో విలసిల్లిన ప్రముఖ బౌద్ధ స్థావరాల వివరాలను తెలుసుకోవడానికి తగిన సమాచారం అందజేయమని బుద్ధ విహార ప్రధానాచార్యుడు కోరారని ఆయన పేర్కొన్నారు. బుద్ధవనం అధికారులను కలిసి ఈ విషయంపై చర్చించి కేవలం దక్షిణాసియా దేశాల నుంచే కాక యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. ఆయన వెంట ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, న్యూయార్క్ తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ సొసైటీ ప్రతినిధి, కథా రచయిత డాక్టర్ కలశపూడి శ్రీనివాసరావు ఉన్నారు.
లారీల్లో నుంచి డీజిల్ చోరీకి యత్నం
ఫ పోలీసులను చూసి పారిపోయిన దొంగలు
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి మండల కేంద్రం పరిధిలో నల్లగొండ బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేసేందుకు యత్నించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకోగా దొంగలు పారిపోయారు. ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలో నల్లగొండ బైపాస్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల వద్ద శుక్రవారం రాత్రి ఇన్నోవా కారు అనుమానాస్పదంగా ఆగి ఉండడంతో పక్కనే ఉన్న టీస్టాల్ యజమాని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని కారును పరిశీలిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. వాహనాన్ని పరిశీలించంగా 50 లీటర్ల సామర్ధ్యం గల 30 డీజిల్ క్యాన్లు, మూడు ప్లాస్టిక్ పైపులు లభించాయి. అందులో 24 క్యాన్లలో డీజిల్ ఉండగా.. 8 క్యాన్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1200 లీటర్ల డీజిల్, ఇన్నోవా కారు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సీసీ కెమెరాలను పరిశీలించగా చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో నుంచి డీజిల్ దొంగిలించి పట్టుబడిన ఇన్నోవా వాహనంలో తరలిస్తున్నట్లు రికార్డయ్యిందని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారితో పాటు నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి పక్కన ఆగి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ప్రభుత్వాస్పత్రిలో పాము
భువనగిరి: భువనగిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాత్రి పాము రావడంతో రోగులు గమనించి దానిని చంపేశారు. ఆస్పత్రి ఆవరణలో చెత్త వేస్తుండడం, విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని రోగులు అంటున్నారు. ఆస్పత్రి ఆవరణను శుభ్రంగా ఉంచడంతో పాటు రాత్రి సమయంలో విద్యుత్ లైట్లు వేయాలని కోరుతున్నారు.