
మొక్కలను రక్షించుకుంటేనే మానవ మనుగడ
కోదాడ: మొక్కలను రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, ప్రతిఒక్కరూ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలకు రాఖీలను కట్టి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు అన్నారు. రాఖీ పర్వదినాన్ని పరస్కరించుకొని కోదాడ పట్టణ పరిధిలోని అశోక్‌నగర్ వద్ద ఆయన ఆధ్వర్యంలో శనివారం మొక్కలకు రాఖీలు కట్టారు. ప్రతి ఇంట్లో చిన్నా పెద్దా మొక్కల ప్రాధాన్యతను గుర్తించి ఈ కార్యక్రమాన్ని తమ ఇంటి నుంచే ప్రారంభించాలని, ముందు ఇంట్లో మొక్కలను, ఆ తర్వాత ఇంటి ముందు మొక్కలను రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీరుద్దీన్, ఆవుల శివప్రసాద్, షేక్ షరీపుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో ఉన్న సోదరుడి వద్దకు వెళ్లి..
● రాఖీ కట్టిన సోదరి
అర్వపల్లి: కానిస్టేబుల్‌గా విధుల్లో ఉన్న సోదరుడి వద్దకే వెళ్లి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది ఓ సోదరి. వివరాలు.. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రమావత్ సుధాకర్ భార్య సుజాత శనివారం తన సోదరుడికి రాఖీ కట్టడానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లింది. ఆమె సోదరుడు లునావత్ శ్రీను సూర్యాపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా శనివారం పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ఉండగా సుజాత నేరుగా అక్కడికి వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహం పక్కనే సోదరుడు శ్రీనుకు రాఖీ కట్టింది.
కుటుంబ కలహాలతో బలవన్మరణం
కేతేపల్లి: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కేతేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన దుబ్బాక రాంరెడ్డి(47) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశాడు. అప్పు తీర్చకపోగా మద్యం సేవిస్తూ కొంతకాలంగా పనికి వెళ్లడం లేదు. ఈ విషయమై భార్య స్వాతితో తరుచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన రాంరెడ్డి ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటంబ సభ్యులు గమనించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.

మొక్కలను రక్షించుకుంటేనే మానవ మనుగడ