ఏరియల్‌ లైడార్‌ సర్వే | - | Sakshi
Sakshi News home page

ఏరియల్‌ లైడార్‌ సర్వే

Aug 11 2025 6:18 AM | Updated on Aug 11 2025 6:18 AM

ఏరియల

ఏరియల్‌ లైడార్‌ సర్వే

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకానికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : శ్రీశైలం లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకం పనులపై ఆశలు చిగురిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద ఇన్‌లెట్‌లోని 14వ కిలోమీటరు వద్ద జరిగిన ప్రమాదంతో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రమాదం జరిగిన చోట టన్నెల్‌ను తవ్వే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా టన్నెల్‌ పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రెండు రకాల సర్వేలు చేయిస్తోంది. వాటి నివేదికల ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో టెన్నల్‌ తవ్వకం పనులను పక్కాగా చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో ఏరియల్‌ లైడార్‌ సర్వే నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేషనల్‌ జియో ఫిజికల్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో వీటెమ్‌ ప్లస్‌ మాగ్నెటిక్‌ జియో ఫిజికల్‌ సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. ఈ సర్వేలు చేపట్టేందుకు రూ.2.36 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం పాలనపరమైన అనుమతులు జారీ చేసింది.

అవాంతరాలతో ఆలస్యం..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో 2005లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను ప్రభుత్వం చేపట్టింది. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి పూర్తి గ్రావిటీ ద్వారా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి వరకు నీటిని తరలించేందుకు 43.930 కిలోమీటర్ల పొడవునా సొరంగం తవ్వకాన్ని చేపట్టింది. ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ కలిపి 34.37 కిలోమీటర్లు టన్నెల్‌ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అందులో ఔట్‌లెట్‌లో 20.435 కిలోమీటర్లు సొరంగం తవ్వకం పూర్తి కాగా, మరో 3.545 కిలోమీటర్ల తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టీబీఎం బేరింగ్‌ పాడైపోవడంతో 2023 జనవరిలో పనులు ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లోనే నిధులను వెచ్చించి అమెరికా నుంచి బేరింగ్‌ తెప్పించ్చింది. బేరింగ్‌ ఏప్రిల్‌ నెలలో మన్నెవారిపల్లికి చేరుకుంది. బేరింగ్‌ను టీబీఎంకు అమర్చేందుకు అవసరమైన పరికరాలు కెనడా నుంచి రావాల్సి ఉంది. డబ్బుల సమస్యతో అవేవీ రాలేదు. దీంతో బేరింగ్‌ వచ్చినా టన్నెల్‌ లోపలికి కూడా తీసుకెళ్లలేదు.

ఇన్‌లెట్‌లో ప్రత్యామ్నాయాలపైనే

ప్రత్యేక దృష్టి

సొరంగం ఇన్‌లెట్‌ దోమలపెంట వైపు నుంచి 13.935 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. ఇంకా 6.015 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే 14వ కిలోమీటరు కంటే ముందు షియర్‌ జోన్‌ కారణంగా పెద్ద ఎత్తున బురద, మట్టి ఉబికి వస్తుండటంతో పనులు 2019లోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి అక్కడ డీవాటరింగ్‌ మాత్రమే కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన పనులను ప్రారంభించారు. టీబీఎంతో తవ్వుతుండగా సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాద దాటికి టీబీఎం ముక్కలైపోయింది. 8 మంది గల్లంతయ్యారు. వారిని వెలికితీసేందుకు 60 రోజులకుపైగా సహాయక చర్యలు కొనసాగాయి. ఇద్దరు కార్మికుల మృతదేహాలను మాత్రమే వెలికితీయగా, ఇంకా ఆరుగురి జాడ తెలియలేదు. పైకప్పు మళ్లీ కూలేందుకు అవకాశం ఉండటంతో సహాయక చర్యలు ఆపేశారు. అయితే ఇన్‌లెట్‌లో 14వ కిలోమీటరు వద్ద కుప్పకూలిన ప్రాంతానికి కంటే ముందు నుంచి యాభై మీటర్ల పక్కకు జరిగి, అక్కడి నుంచి సమాంతరంగా డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ పద్ధతిలో సొరంగం తవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రెండు జాతీయ సంస్థల ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

వేగం పుంజుకోనున్న సర్వే పనులు

టన్నెల్‌ ప్రాంతం అంతా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు, పర్యావరణ రక్షణ కోసం డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం కాకుండా టీబీఎం ద్వారా తవ్వకాన్ని చేపట్టింది. అయితే ఇన్‌లెట్‌ కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ఎలా ముందుకు సాగాలనే విషయంలో పలు అంశాలను పరిశీలిస్తోంది. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో టన్నెల్‌ తవ్వాలన్న దానిపై రెండు రకాల సర్వే చేపట్టేందుకు ఉపక్రమించింది. అందుకు నిధులు కూడా విడుదల చేసింది. ఔట్‌లెట్‌లోనూ బేరింగ్‌ బిగించేందుకు అవసరమైన పరికరాలను తెప్పించేందుకు కసరత్తు చేస్తోంది.

ఫ ఆరు నెలలుగా నిలిచిన పనుల్లో కదలిక

ఫ తాజాగా రెండు రకాల సర్వేకు ప్రభుత్వం కసరత్తు

ఫ సర్వేకు రూ.2.36 కోట్లతో

పరిపాలనా అనుమతులు

ఫ 9.56 కిలోమీటర్ల టన్నెల్‌ పూర్తయితే నల్లగొండకు జలసిరి

ఏరియల్‌ లైడార్‌ సర్వే1
1/1

ఏరియల్‌ లైడార్‌ సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement