
13 వరకు రైతు బీమా దరఖాస్తులు
నల్లగొండ అగ్రికల్చర్ : కొత్తగా పాస్‌బుక్‌తో వచ్చిన రైతులంతా రైతు బీమా కోసం ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన, 18 నుంచి 59 సంవత్సరాల వరకు వయసు ఉన్న రైతులందరూ రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్‌లతో పూర్తి చేసిన దరఖాస్తులను ఏఈఓలకు అందజేయాలని సూచించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కట్టంగూర్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు. ఈ నీటితో కొండకిందిగూడెం, బండపాలెం, ఇనుపాముల, కేతేపల్లి, కొర్లపహాడ్, నోముల, నకిరేకల్ చెరువులను నింపుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సుంకరబోయిన నర్సింహ, మాద యాదగిరి, రెడ్డిపల్లి సాగర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, నంద్యాల వెంకట్‌రెడ్డి, బెజవాడ సైదులు, చెవుగోని సాయిలు, ఎడ్ల పెదరాములు, చెవుగోని రవి, మర్రి రాజు, ముక్కాముల శేఖర్, ఇరిగేషన్ డీఈ భూషణాచారి, ఏఈలు పాండు, చందన ఉన్నారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కృషి
దేవరకొండ : ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా దేవరకొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసీ సొంతమన్నారు. దేశంలో ఆదివాసీలు సమానత్వం, హక్కులు, వివక్ష లేని సమాజం కోసం ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారని వారి హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఛత్రునాయక్, ఎంపీడీఓ డానియల్, తహసీల్ధార్ మధుసూదన్‌రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, వేణుధర్‌రెడ్డి, బిక్కూనాయక్, కొర్ర రాంసింగ్ తదితరులు ఉన్నారు.
పండుగ వేళ ఆర్టీసీ బాదుడు
మిర్యాలగూడ టౌన్, కొండమల్లెపల్లి : పండుగలకు ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల భారం మోపుతోంది. రాఖీ పండుగ సందర్భంగా రీజియన్ పరిధిలో బస్ చార్జీలను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచింది. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సుకు చార్జీ రూ.310 ఉండగా.. రాఖీ రోజున రూ.430కి పెంచింది. అంటే ఒక్క టికెట్‌పై రూ.120 అదనంగా వసూలు చేసింది. దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్‌చార్జీ రూ.160 ఉండగా రూ.220 వసూలు చేశారు. ఓ పక్క మహిళలకు ఫ్రీ ఇస్తూనే.. పండగ స్పెషల్ అంటూ అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

13 వరకు రైతు బీమా దరఖాస్తులు

13 వరకు రైతు బీమా దరఖాస్తులు