
పంట పొలాల్లో ఇసుక మేట
ఫ భారీగా దెబ్బతిన్న పంటలు
ఫ ధ్వంసమైన లింకురోడ్లు
ఫ శాలిగౌరారం మండలాన్ని అతలాకుతలం చేసిన వర్షం
శాలిగౌరారం : మండలంలో గురువారం కురిసిన అతి భారీ వర్షం శాలిగౌరారం మండలాన్ని అతలాకుతలం చేసింది. 14.1 సెంటీమీటర్ల వర్షంతో మండలకేంద్రంతో పాటూ మండలంలోని పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగి చెరువులు, కుంటలను తలపించాయి. భారీ వర్షంతో పోటెత్తిన వరదలకు ఆయా గ్రామాల్లో వరి, పత్తి పంటపొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శనివారం నాటికి వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద గల లోతట్టు ప్రాంతంలో వరదనీటి ప్రభావం అత్యధికంగా ఉండటంతో వరి చేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వలతో పాటూ రామగిరి, తిరుమలరాయునిగూడెం, శాలిగౌరారం గ్రామాల వరదనీరు మొత్తం శాలిగౌరారం బస్టాప్ వద్ద ఉన్న లోతట్టు భూములమీదుగానే ప్రవహించడంతో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి.
దెబ్బతిన్న అనుసంధాన రోడ్లు..
భారీ వర్షానికి మండలంలోని గ్రామాలకు మధ్యన అనుసంధానంగా ఉన్న లింక్‌రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా రోడ్లపై రాకపోకలు సాగించడం కష్టతరంగా మారింది. అందులో ప్రధానంగా ఊట్కూరు–బండమీదిగూడెం గ్రామం రోడ్డు, భైరవునిబండ–అద్దెలోనిబావి రోడ్డు, శాలిలింగోటం–తుడిమిడి రోడ్డు, అంభారిపేట–చిత్తలూరి రోడ్లు ఉన్నాయి. బండమీదిగూడెం మెటల్‌రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాళ్లు తేలడంతో వాహనాలు సైతం నడుపలేని అధ్వాన్న పరిస్థితి ఏర్పడింది.
పొలం ఇసుకమేటలు వేశాయి
శాలిగౌరారం బస్టాప్ వద్ద నాకున్న ఎకరం భూమిలో ఇటీవలే వరినాటు వేశాను. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాల్వ కట్ట తెగి పొలంమీదుగా వరద ప్రవహించింది. పొలం మొత్తం రాళ్లు, ఇసుక మేటలు వేశాయి. రూ.30 వేలు ఖర్చుపెట్టి పంటసాగు చేస్తే వర్షం నా పొలాన్ని రాళ్ల కుప్పగా మార్చింది. ప్రభుత్వమే మమ్ములను ఆదుకుని న్యాయం చేయాలి.
– షేక్ మహబూబ్‌అలీ, రైతు, శాలిగౌరారం

పంట పొలాల్లో ఇసుక మేట

పంట పొలాల్లో ఇసుక మేట