
ఆర్‌అండ్‌బీ అతిథి గృహంగా మార్చాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్‌అండ్‌బీ భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌గా మార్చుకోవడం సిగ్గుచేటని, వెంటనే ఆర్‌అండ్‌బీ అతిథి గృహంగా మార్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం కోమటిరెడ్డి తాపత్రయపడుతున్నాడని ఎద్దేవా చేశాడు. ఎంతో మంది ప్రముఖులు బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌గా మార్చుకోవడం మూర్ఖత్వం కాదా అని ప్రశ్నించారు. 500 మంది విద్యార్థులకు భోజనాలు పెట్టి 5 వేల మందికి పెట్టించానని ఫోన్‌లో సీఎంతో చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని, వారు ఎప్పుడు ఏం మాట్లాడుతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నేత గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పిల్లి రామరాజుయాదవ్, పోతెపాక సాంబయ్య, పోతెపాక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి