ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తులు
నల్లగొండ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందడానికి ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ నెల 20లోగా ఆన్‌లైన్ tgswreis.telanga na. go v.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని షెడ్యుల్డ్ కులాల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 7995010667 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగొద్దు
కేతేపల్లి : రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల డీఎం జె.హరీష్ ఆదేశించారు. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5.07 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం 17,729 టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.903 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట కేతేపల్లి ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఏఓ బి.పురుషోత్తం, ఆర్‌ఐ రాంచంద్రయ్య తదితరులు ఉన్నారు.
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ జిల్లా కమిటీ ఎన్నిక
నల్లగొండ టూటౌన్ : ప్రభుత్వ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ టీచర్స్ జిల్లా కమిటీని శనివారం నల్లగొండలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రూపవత్ రవినాయక్, ప్రధాన కార్యదర్శిగా రమావత్ శ్రీనునాయక్, ఉపాధ్యక్షులుగా రుపావత్ అనంతరాములు, వెంకటరెడ్డి, బ్రహ్మచారి, కోశాధికారిగా జిలకర భాస్కర్, కార్యదర్శులుగా ఆర్.వెన్నెల, పి.రూప, ఎం.అనితను ఎన్నుకున్నారు.
పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి
నల్లగొండ: నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. కోర్టు ఎదురుగా ఉన్న మెలోడీ భవనం స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, చలపతిరావు ఉన్నారు.
జ్యూరీ మెంబర్‌గా మిర్యాలగూడ వాసి
మిర్యాలగూడ : గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025 కమిటీలో జ్యూరీ మెంబర్‌గా మిర్యాలగూడకు చెందిన సీనియర్ జర్నలిస్టు వాకిటి మధును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఆయన రాష్ట్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. మిర్యాలగూడ డివిజన్‌లో 1979 వరకు ఓ దినపత్రికలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థలో మేనేజర్‌గా చేరారు. ఉద్యోగ విరమణ అనంతరం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అవార్డు జ్యూరీ సభ్యులుగా మధు ఎంపికపై స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తులు


