మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు
ఫ వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం రాత్రి మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల కసరత్తు వేగవంతం కానుంది. వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా ఖరారు చేసి జనవరి 10న ప్రకటించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నెల 30న మున్సిపాలిటీల వారీగా వివరాలు సరిచూసుకోవాలని, 31వ తేదీన వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. జనవరి 1న పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాల ముసాయిదా ప్రకటించాలని స్పష్టం చేసింది. 5వ తేదీన మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో, 6వ తేదీన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని వివరించింది. 10వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా ఫైనల్ ఓటర్ల జాబితాలు ప్రకటించాలని వెల్లడించింది. అలాగే మున్సిపాలిటీల వారీగా 2011 ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలను కూడా జారీచేసింది.
డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగాబాధ్యతల స్వీకరణ
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. బ్యాంకు అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ శంకర్‌రావు, అధికారులు నర్మద, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, పశుసంవర్థక అధికారి డాక్టర్ రమేష్, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
డీసీసీబీ అభ్యున్నతికి కృషి చేశాం
తన రెండేళ్ల పదవీ కాలంలో బ్యాంకు అభ్యున్నతికి తమ పాలకవర్గం కృషి చేసిందని డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని డీసీసీబీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే నాటికి రూ.900 కోట్ల టర్నోవర్‌లో ఉన్న బ్యాంకును రూ.3680 కోట్ల టర్నోటర్‌కు తెచ్చి రూ.60 కోట్ల లాభాల దిశగా నడిపించామన్నారు. రైతులు, విద్యార్థులకు, ఇతర రుణాలను అందించడంలో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ముందున్నామన్నారు. రాష్ట్రంలోనే బ్యాంకును రెండో స్థానంలో నిలిపిన ఘనత తమ పాలక వర్గానికి దక్కిందన్నారు. బ్యాంకు అభ్యున్నతికి సహకరించిన పాలకవర్గ సభ్యులకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మాజీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


